ఫోక్సో కేసుల్లో శిక్ష పడేలా విచారణ సాగాలి
- పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
- అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరిక

కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా జిల్లా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడేలా కృషిచేయాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.వేసవి కాలం సెలవుల దృష్ట్యా దొంగతనాలు జరగకుండా గస్తి పెంచి పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని తెలిపారు. ముందుగా విధులు నందు ఉత్తమ ప్రతిభను కనబరిచి రివార్డులను అందుకున్న పోలీస్ అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ సీఐ సర్వయ్య ,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము,ఏవో మంజ్యా నాయక్,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.