మత్తులో భవిష్యత్తు చిత్తు చేసుకోవద్దు
- బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
- కార్పొరేటర్ మహమ్మద్ దావూద్

కొత్తగూడెం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కార్పొరేటర్ మహమ్మద్ దావూద్ ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా 58వ డివిజన్‌లో బాల్య వివాహాల నివారణ, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ మొహమ్మద్ దావూద్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు మగపిల్లలకు పెళ్లి చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
బాల్య వివాహం వల్ల ఆడపిల్లల చదువు, ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆడపిల్ల, మగపిల్ల చదువుకోవాలి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నా, డ్రగ్స్ విక్రయిస్తున్నా వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్1098 లేదా పోలీస్ 100కు సమాచారం అందించాలని కోరారు. 58వ డివిజన్‌ను బాల్య వివాహ రహిత, డ్రగ్స్ రహిత డివిజన్‌గా తీర్చిదిద్దుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ శారద, టీచర్లు కే శేషు కుమారి, జ్యోతి ఆయమ్మ రాములమ్మ, ఆశా వర్కర్లు లత, నాగలక్ష్మి, మహిళా సంఘాలతో కలిసి డివిజన్‌లోని మైనర్ బాలబాలికలు, తల్లిదండ్రులతో పాల్గొన్నారు.