గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు భేష్!

సమన్వయంతో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డులు

  • వైద్య శాఖకు కలెక్టర్ అభినందనలు

కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో ఒక భాగంగా జిల్లా వైద్య విధానం పరిషత్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంగా ఉన్న జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలను అందించడం ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, జిల్లా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు .

గతంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి, కమ్యూనికేషన్ సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్య సేవలను సమర్థవంతంగా అందించడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో చర్ల, గుండాల వంటి దూర ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించడం సాధ్యమైందని తెలిపారు. టెలీమెడిసిన్, డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ వైద్య సేవల ద్వారా ప్రజలకు సమయానికి చికిత్స అందించడం సాధ్యమవుతోందని చెప్పారు.

ఈ విజయానికి ఆశా కార్యకర్తల నుండి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు వరకు అందరి సమన్వయం ముఖ్య కారణమని కలెక్టర్ అన్నారు . ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్లనే జిల్లాకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అవార్డులు లభించాయని తెలిపారు. ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు.

జిల్లా వైద్య శాఖ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయితో పాటు దేశ స్థాయిలో కూడా అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రతి పల్లె, ప్రతి గిరిజన ప్రాంతానికి ఆరోగ్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు .

ప్రస్తుత సంవత్సరంలో సాధించిన విజయాలను కొనసాగిస్తూ, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు జిల్లాకు తీసుకురావాలని వైద్య సిబ్బందిని ప్రోత్సహించారు. సేవా భావంతో పనిచేసే వైద్య సిబ్బంది వల్లే ప్రజల నమ్మకం పెరుగుతుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ముందుగా వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి, వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రవిబాబు, తాసిల్దార్ దారా ప్రసాద్, ఆసుపత్రుల సూపర్డెంట్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading