ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు బాధాకరం
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు

కొత్తగూడెం: ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక కొత్తగూడెం లోని మంచికంటి భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పు బాధాకరం అన్నారు. విద్యార్థుల నుండి ఫీజులు వసూళ్లు చేసుకోని, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్ధులకు చెల్లించాలని తీర్పు సరైనది కాదన్నారు.
ఈ తీర్పును అదునుగా తీసుకుని ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా విద్యార్ధులనుండి ఫీజులు వసూలు చేసే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హై కోర్టు నిర్ణయం విద్యార్థుల చదువులకి అడ్డుగోడగా ఉందని, దీనిని హైకోర్టు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని గుర్తు చేశారు. ప్రైవేటు యాజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్ధుల నుండి వసూళ్లు చేసుకోండి అనే తీర్పు సరైనది కాదన్నారు.
అణాగారిన వర్గాలు నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ప్రధానంగా ఈ ఫీజులు పోందే పేద విద్యార్థులలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి ,మైనారిటీ విద్యార్ధులే ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని స్పష్టం చేశారు. హై కోర్టు తీర్పుతో విద్యార్థులు మరింత వేధింపులు గురి అవుతారని ఆవేదన చెందారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు బకాయిలు రావడం లేదని పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారని, దీని వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
పేద విద్యార్థులకు అనుకూలంగా తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. తక్షణమే ఫీజుల విడుదల కోసం ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగక్రిష్ణ , జిల్లా ఉపాధ్యక్షులు మాధసు అఖిల్ , కొప్పుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.