గంజాయి కేసులో ఇద్దరికి 10 ఏళ్ళ జైలు శిక్ష
కొత్తగూడెం: గంజాయి కలిగిన ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఇద్దరికీ చెరొక రూ లక్ష జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఎన్‌డిపిఎస్‌స్పెషల్ జడ్జ్)ఎస్ సరిత తీర్పు చెప్పారు. 2020 సెప్టెంబర్ 15న భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ బి మహేష్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేపట్టారు. టాటా కంపెనీ మినీ గూడ్స్ వ్యాన్ అతివేగంగా వస్తుండగా ఆపి తనిఖీ చేయగా పది ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒడిస్సా రాష్ట్ర మల్కానగిరి జిల్లాకు చెందిన సుజిత్ గోల్డ్డర్, మనోజిత్ రాయిలను అదుపులోకి తీసుకొని ఇన్స్పెక్టర్ టి స్వామి కేసు నమోదు చేశారు. సుమారు 226.500 కిలోలు ఉంటుందని, మార్కెట్‌లో దీని విలువ రూ 33.97 లక్షల విలువ చేస్తుందన్నారు.దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
కోర్టులో ముగ్గురు సాక్షులను విచారించారు. సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్ పై నేరం రుజువు కాగా, ఇద్దరికీ పది ఏళ్ళు జైలు శిక్ష, ఇద్దరికీ రూ లక్ష జరిమానా విధించింది కోర్టు. జరిమానా చెల్లించనీ పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి రాఘవయ్య ,లైజాన్ ఆఫీసర్ ఎస్ వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసీ సుధీర్ బాబు సహకరించారు.