స్థానిక ఎన్నికలకు సైరన్
- జిల్లాలో 22జడ్పిపి స్థానాలలో 10 మంది మహిళలకు అవకాశం
- 22 ఎంపిపి స్థానాలలో ఎస్టీలకు 20సీట్లు

భద్రాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 9 జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ఈసీ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇతరులకు ఏయే స్థానాలు రానున్నాయో జాబితాలను సీల్డ్ కవర్‌లో పంపించాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ మేరకు షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ఏరియాల సిద్ధం చేసి పంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలతోపాటు 22ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్‌లను ఖరారు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. జిల్లాలో 22 జడ్పి స్థానాలలో 10 సీట్లు మహిళలకు కేటాయించారు. 22 ఎంపిపి స్థానాలలో 20 సీట్లు ఎస్టీలకు కేటాయింపు జరిగింది. ఎస్సిలకు ఒక్క చుంచుపల్లి జడ్పి సీటు మాత్రమే లభించింది. జిల్లాలో ఎంపిపి స్థానాలకు ఒక్కటి కూడా ఎస్సిలకు కేటాయింప బడలేదు.
రిజర్వేషన్‌ల ప్రకారం లక్ష్మీదేవిపల్లి, పినపాక, అశ్వాపురం, అన్నపురెడ్డిపల్లి, బూర్గంపహాడ్ ఎస్టీ జనరల్ అవ్వగా, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, చండ్రుగొండ, మణుగూరు ఎస్టీ మహిళలకు కేటాయించబడినవి. చుంచుపల్లి మండలం ఒక్కటే ఎస్సి జనరల్ అయ్యింది. జూలూరుపాడు, సుజాతనగర్, ఇల్లందు, చర్ల బిసి జరనరల్‌కు కేటాయించగా భద్రాచలం, ములకలపల్లి, కరకగూడెం ఈ మూడు స్థానాలు బిసి మహిళలకు కేటాయించారు. మిగిలిన నాలుగింటిలో దుమ్ముగూడెం, గుండాల స్థానాలను అదర్స్ జనరల్ చేయగా మిగిలిన రెండు టేకులపల్లి, ఆల్లపల్లి జడ్పి స్థానాలను ఆదర్స్ మహిళలకు కేటాయించారు. ఇక 22 ఎంపిపి స్థానాలలో నాన్ షెడ్యూల్ ఏరియాలలోని మండలాల్లో అశ్వారావు పేట ఎస్టి మహిళ, అశ్వాపురం ఎస్టి జనరల్, బుర్గంపహాడ్ బిసి జనరల్, దమ్మపేట అదర్స్ జనరల్‌గాను, షెడ్యూల్ ఏరియాలోని ఆళ్ళపల్లి, చండ్రుగొండ, దుమ్ముగూడెం, జూలూరుపాడు, కరకగూడెం, మణుగూరు, ములకలపల్లి, సుజాతనగర్, ఇల్లందు ఎస్టి జనరల్‌గాను, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, చర్ల, చుంచుపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ,పినపాక, టేకులపల్లి మండాలల ఎంపిపి స్థానాలను ఎస్టి మహిళలకు కేటాంపు జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదలై ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్న నేపధ్యంలో ముందుగా జిల్లా కలెక్టర్ అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జిల్లాలోని 22 జడ్పి, ఎంపిపి స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు.