శబాష్ ఆటో డ్రైవర్

కొత్తగూడెం : ప్రస్తుత సమాజంలో ఆటోడ్రైవర్లు అంటే సమాజంలో ఓ చిన్న చూపు, ఎన్నో అపోహలు. అయితే ఏం తమను ఎవరు శంకించినా తాము మాత్రం ప్రయాణికుల పట్ల నిజాయితీగా నడుచుకుంటాము అంటున్నాడు కొత్తగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ ఏలూరు వెంకటేశ్వర్లు. టేకులపల్లి మండలం చింతోని చెలుక గ్రామానికి చెందిన కావూరి బ్రహ్మశ్వేర్‌రావు హైద్రాబాద్ వెళ్లడానికి ఇంటినుండి కొత్తగూడెం ఆటోలో బయల్దేరాడు. కొత్తగూడెంలోని పాత డిపో దగ్గర ఆటో దిగి మరొక ఆటో ఎక్కి బస్టాండ్ వద్ద దిగాడు. ఊరికి వెళ్ళే కంగారులో ఆటోలో తన కూతురుకి చెందిన సుమారు రూ 9 లక్షలు విలువ జేసే పట్టు చీరల బ్యాగ్ మరిచిపోయాడు. ఇది గమనించిన డ్రైవర్ బ్యాగ్‌ను 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేశాడు. బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలోని కెమెరాలను పరిశీలించి బ్యాగ్ బ్రహ్మశ్వేర్‌రావుదని నిర్ధారించి ఆటో డ్రైవర్ చేతలమీదుగా బ్యాగ్ తిరిగి అప్పగించారు. ఈ సందర్బంగా 3 టౌన్ సిఐ అబ్బయ్య ఆటో డ్రైవర్ ఏలూరు వెంకటేశ్వర్లుని అభినందించారు. అతడి నిజాయితీ మిగతా ఆటోవాలలకి స్ఫూర్తిదాయకం అని అభివర్ణించారు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటే బాధితులకు బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ గమనించి ఇతరులకి సహాయపడలని సుచించారు. నిజాయితీ అంటే నీదే అని ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లును శబాష్ అని అందరు మెచ్చుకుంటున్నారు.