ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాల
- 144 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- జిల్లాలో 1,84,502 మెట్రిక్ టన్నుల ధాన్యం
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి : యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ, శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,84,502 మెట్రిక్ టన్నుల కాగా అందులో సన్నరకం 99,729 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం దాన్యం వస్తుందనే అంచనాతో 144 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యం రూ 2320, బి గ్రేడ్ రకం రూ2300 మద్దుతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు,హమాలీలు వడ దెబ్బకు గురి కాకుండా టెంట్లు, షెడ్ నెట్‌లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నీడ ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. క్రాప్ బుకింగ్ చేసిన ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు.
జిల్లాకు సమీప రాష్ట్రాల నుండి దాన్యం నియంత్రణకు సరిహద్దులో 8 చెక్ పోస్టుల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సెంటర్ ఇన్చార్జిపైనా, మిల్లర్లుపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గన్నీ సంచులు తీసుకున్న రైతుల వివరాలను రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు మంత్ర ఐరిస్ స్కానర్ ద్వారా మాత్రమే కొనుగోలు పూర్తి అవుతుందని, డేటా ఎంట్రీ పూర్తి చేసేటప్పుడు రైతు కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తూకపు బాట్లు తనిఖీ చేసి సీల్స్ వేయాలని చెప్పారు.
సీఎంఆర్ 2024-25 ఖరీఫ్ సంబంధించి డెలివరీలను సకాలంలో చేసేలా రైస్ మిల్స్‌ను తనిఖీ చేసి నివేదికలు అందించాలని పౌరసరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డిఆర్డిఓ విద్యచందన, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, డిసిఓ కుర్షిథ్, వ్యవసాయ అధికారి బాబురావు, జిసిసి మేనేజర్ విజయకుమార్, తూనికలు కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రెస్ మిలర్ అసోసియేషన్ నుండి ఆనందరావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నాడు.