చెక్కుల పంపిణీలో చెలరేగిన మాటల యుద్దం
- బిఆర్‌ఎస్‌కు విమర్శించే నైతిక హక్కు లేదు
- చైర్‌పర్సన్‌కు క్రంగెస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్

కొత్తగూడెం : కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ మాటల యుద్దానికి తెర లేపగా అక్కడే ఉన్న రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి ఆమె మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.కొత్తగూడెం మున్సిపాలిటీ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొత్తగూడెం క్లబ్బులో లబ్దిదారులకు ఎమ్మెల్యే కూనంనేని సాబశివరావు అందజేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ కళ్యాలక్ష్మీ లబ్దిదారులకు తులం బంగారం ఏమైందని వేధిక మీదినుండి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంతో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్తగూడెం ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటా అంటు సభా ముఖంగా చెప్పింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ కాంగ్రెస్ పార్టీ పనితీరును విమర్శిస్తూ వస్తున్నారు.
వెంటనే అక్కడే ఉన్న సెంట్రల్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి ఆమె మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు పేదలకు ఎండమావిగా మారాయని, మూడు ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారో తెలియదని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ ఎంతమందిని చేశారో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. గత పది ఏళ్ళలో ఏ ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వలేదని, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్‌ఎస్‌కు దక్కుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినకాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు.
ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత బస్సు , 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా రూ 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి నడుం బిగించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా సిఎం రేవంత్ రెడ్డి వారి మంత్రి వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. బిఆర్‌ఎస్‌ది పాలనలో రాష్ట్రంతోపాటు మున్సిపాలిటీలోను అవినీతి పాలనే జరిగిందని ఎద్దేవ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒక్కరికి కూడా అందలేదని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర సమాచార, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రజా పాలన ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ఐదు లక్ష్యల మంది లబ్దిదారులకు అందిచేలా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాలిశెట్టి సత్యభామ, తలుగు అనిల్, తంగెళ్ల లక్ష్మణ్, పల్లపు లక్ష్మణ్, వనచర్ల విమల ఇతర కౌన్సిలర్లు వై శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.