ఉద్యమ భాస్కరుడికి కడసారీ కన్నీటి వీడ్కోలు
- పాడె మోసిన ఎంపి వద్దిరాజు, జిల్లా అధ్యక్షుడు రేగా
- అంతిమ యాత్రకు అశేష జనం

భద్రాద్రి : కొత్తగూడెంలో అస్తమించిన తెలంగాణ మలిదశ ఉద్యమ భాస్కరుడికి బిఆర్‌ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతంలో అగ్రభాగాన నిలిచి పోరాడిన బిఆర్‌ఎస్ నాయకుడు మోరె భాస్కర్ బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంపి వద్దిరాజు రవిచంద్ర భాస్కర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచన మేరకు ఢిల్లీ నుంచి హుటాహుటిన కొత్తగూడెం చేరుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, జేఏసీ ఛైర్మన్ ఉప్పల వెంకట రమణలతో కలిసి మోరె భాస్కర్ రావు భౌతికకాయానికి గులాబీ జెండా కప్పి పూలమాలలు వేసి వివాళులు అర్పించారు. శోకసంద్రంలో ఉన్న భాస్కర్ సతీమణి పార్వతి, కుమారులు పవన్ కళ్యాణ్, చాణక్యలను ఎంపీ రవిచంద్ర, కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు ఓదార్చి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎంపి రవిచంద్ర బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెటిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సీ కవితలకు ఫోన్ చేసి భాస్కర్ సతీమణి పార్వతి, కుమారులతో మాట్లాడిరచారు. ప్రస్తుంత కేరళలో ఉన్నానని, త్వరలోనే ఇంటికి వచ్చి అందరిని కలుస్తానని, ఆత్మస్థైర్యంతో ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని కెటిఆర్ వారికి హామీ ఇచ్చారు.

ఎంపి దగ్గర ఉండి అంత్యక్రియల ఏర్పాట్లు
బిఆర్‌ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,ఉద్యమ సహచరుల అశ్రునయనాల మధ్య భాస్కర్ రావు కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ నాయకుడు, తన సన్నిహితుడు మోరె భాస్కర్ భౌతికకాయాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందర్శించి ఘనంగా నివాళు అర్పించారు. పార్లమెంట్ సమావేశాలలో ఉన్న ఎంపీ రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచన మేరకు ఢల్లీ నుంచి హుటాహుటిన గురువారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నారు. ఎంపి రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, జెఎసి ఛైర్మన్ ఉప్పల వెంకట రమణలతో కలిసి కొత్తగూడెం నాగయ్య గడ్డలోని భాస్కర్ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయంపై గులాబీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో భాస్కర్ చురుకైన పాత్ర పోషించారు. గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు, దీక్షాదివస్ తదితర సందర్భాలలో పార్టీ ఇంఛార్జిగా ఉన్న సమయంలో భాస్కర్ తనతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. వారం కిందట దీక్షా దివస్ వేదికపై తాను సన్మానించిన ఉద్యమ భాస్కరుడు ఆకస్మికంగా అస్తమించాడన్న వార్త ఎంతగానో కలచివేసిందిని ఆవేదన వ్యక్తం చేశారు. మోరె భాస్కర్ లాంటి నాయకుడిని కోల్పోడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం భాస్కర్ పార్థివ దేహాన్ని కొత్తగూడెం పట్టణంలోని బిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయానికి తరలించి పార్టీ క్యాడర్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఎంపి వద్దిరాజు దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు స్వయంగా పర్యావేక్షించారు. పాడె పట్టి ఉద్యమ భాస్కరుడి భౌతికకాయాన్ని తన భూజాలపై మోస్తూ జై తెలంగాణ జైజై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్ బీఆర్‌ఎస్ జిందాబాద్’’, వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి కెసిఆర్ నాయకత్వం వర్థిల్లాలి’’, అమర్ హై అమర్ హై మోరె భాస్కర్ అమర్ హై’’, జోహార్లు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు’’ అనే నినాదాలతో బరువెక్కిన హృదయంతో కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య రామవరం శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో వనమా రాఘవ, సహచరులు అన్వర్ పాషా, బత్తుల వీరయ్యలు, భాస్కర్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమకారులు తొగరు రాజశేఖర్, హుస్సేన్, బండి రాజుగౌడ్, అనుదీప్, పగడాల నరేందర్, సుబ్బారావు, నవతన్ కుమార్, శ్రీపాద సత్యనారాయణ, మన్సూర్, సింధూతపస్వి,రవి గౌడ్, మంజూర్ తదితరులు ఉద్యమ సహచరులు పాల్గొన్నారు.