సింగరేణి తెలంగాణ సొత్తు
సంపదను ప్రజలకే పంచుదాం
రూ18 వేల కోట్ల బకాయిలకు కారణాలేంటి
అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి : సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల సొత్తు అని, అందులో సృష్టించే సంపదను ప్రజలకు పంచుదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల వచ్చే లాభాలతో ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే లాభం గడిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

థర్మల్ పవర్, సోలార్ పవర్, బొగ్గు ఉత్పత్తి, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, సంస్థ ఆదాయ, వ్యయం, ఉద్యోగస్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను సంస్థ సి అండ్ ఎండి ఎన్ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు రూ 1521 కోట్లు సింగరేణికి చెల్లించాల్సి ఉండగా, 2023 నాటికి రూ18,326 కోట్లు బకాయిలు ఎలా పెరిగాయని, ట్రాన్స్కో జెన్కో కంపెనీల నుంచి రావలసిన బకాయిలపై సమగ్రంగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థలో లక్షా ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటే, నేడు 42 వేల మందికి ఎలా కుదించారని అధికారులను ప్రశ్నించారు. బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న క్రమంలో 18 ఓసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని, తద్వారా ఖర్చులు తగ్గి నష్టాల నుంచి అధిగమించామని అధికారులు ఇచ్చిన సమాధానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెటింగ్ కోణంలో కరెక్ట్ అయినా సామాజిక బాధ్యత అనిపించుకోదని హితవు పలికారు. ఓపెన్ కాస్ట్ లను ప్రైవేతీకరణతో ఉపాధి కోల్పోయి ప్రజలు ఇMబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, నిరుద్యోగ సమస్య పెరగడం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుందన్నారు. ప్రైవేటీకరణకు చెక్ పెట్టాలన్నారు. పాదయాత్రలో జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఓపెన్ కాస్ట్ మైనింగ్ పరిశీలించిన సందర్భంగా సింగరేణి ఉద్యోగి, ఔట్సోర్సింగ్ కార్మికుని జీతంలో చాలా వ్యత్యాసం ఉండటం సమాజానికి మేలు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని ప్రైవేటు పరం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.