సమస్యలపై బీఆర్ఎస్ పోరు బాట
- ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా
కొత్తగూడెం : చుంచుపల్లి మండలంలో గుంతల రోడ్లు, పారిశుద్ధ్యంపై డిజిటల్ క్యాంపెయిన్ చేసినా స్పందన కరువు అయిందని బిఆర్ ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చుంచుపల్లి మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గూడెల్లి యాకయ్య ముత్యాల రాజేష్ డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కంతారావు పిలుపు మేరకు మండలంలో అందాలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
మండలంలో రోడ్లు పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రయాణానికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆవేదన చెందారు. గతంలో ఈ సమస్యలపై పలుమార్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించినా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక రాలేదని విమర్శించారు. రోడ్ల మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారిణి సిహెచ్ సుభాషినికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతి గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రంగరాజు రాజేష్ గారు, సాగర్, రమేష్, శ్రీకాంత్ నాయక్, రవి, మనోహర్, దీపక్, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, ఎండి యూసుఫ్, కలకోట ఐలయ్య, బోనగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు.