ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలి
- లేదంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం
- సామూహిక పుస్తక పఠనం చేస్తూ నిరసన
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగక్రిష్ణ

కొత్తగూడెం : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగక్రిష్ణ విమర్శించారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్మెంట్ ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో సామూహిక పుస్తక పఠనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగక్రిష్ణ మాట్లాడుతూ స్కాలర్షిప్ బకాయిలు అందక ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తమ కాలేజీలను మూసివేసాయని ఆందోళన వ్యక్తం చేసారు. విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని, ఐదు రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ 8,158 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు బకాయిలు చెల్లించకుండా ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చులు చేస్తున్నారని ఆగ్రహంచారు. కళాశాలల మూసివేత కారణంగా విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందని అవేదన వ్యక్తం చేసారు. ఎన్నికలు , ఇతర పథకాల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ దేశ , రాష్ట్ర భావిభారత పౌరులైన విద్యార్థులను గాలికి వదిలేయడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సిగ్గు మాలిన చర్య అని వారు మండిపడ్డారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులతో కలిసి సచివాలయాన్ని సైతం ముట్టడించడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రిశ్వత్ , టౌన్ నాయకులు మాహిర్, రెహానా, ధనుష్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.