సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన దీక్ష
- జీతాలు పెంచకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
- కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక

కొత్తగూడెం : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమకు గుర్తింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ గుర్తించి జీతాలు వెంటనే పెంచేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన దీక్షను చేపట్టి అనంతరం హెడ్ ఆఫీస్ ముందు భారీ ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు పెంచుతున్నామని, శుభవార్తా త్వరలోనే చెబుతామని మోసం చేయకుండా కళ్ళ బొల్లి మాటలు ఆపి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ప్రధాన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు, డిప్యూటి సిఎంకు యూనియన్‌లు అన్నింటి తరఫున వినతి పత్రాలు మన గోడు చెప్పినప్పటికీ త్వరలోనే జీతాలు పెంచుతామని అని ప్రకటన చేసి సంవత్సరం గడుస్తున్న నేటికీ ఒక్క ప్రకటన కూడా జీతాల విషయంలో చేయలేదని విమర్శించారు. గత నాలుగు నెలల నుండి సింగరేణి సీఅండ్‌ఎండి బలరాం నాయక్‌ని కలిసి జేఏసీ నాయకులు కోదండరాంతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి మార్పు లేదని ఆగ్రహించారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల కమిటీ వేసి ప్రకటిస్తామని కాలయాపన చేస్తున్నారే తప్ప కాంట్రాక్టు కార్మికుల శ్రమను మాత్రం గౌరవించట్లేదని ఆరోపించారు. సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్‌లో కాంటాక్ట్ కార్మికుల సమస్యలు చర్చించకుండా, జీతాలు వైద్య సదుపాయాలు, సౌకర్యాల పట్ల ఎటువంటి ప్రకటన చేయకుండా సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కోలిండియా వేతనాలు అమలు చేయాలని జీవో నెంబర్ 22న అమలు చేసి గెజిట్ చేసి వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తుంటే అత్యధిక భాగం సింగరేణి లాభాల్లో తమ శ్రమ ఉందని, లాభాల్లో వాటా ఇవ్వాలి అన్నారు. వేతనాలు మాత్రం పెంచకుండా మాయమాటలతో కార్మికులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసినా ప్రయేజనం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమతి తల్లి ప్రేమ కనబరుస్తుందని విమర్శించారు. ముందుగా ఈ దీక్షను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మల్లెల రామనాథం ఏజే రమేష్ ఆర్ మధుసూదన్ కాపు కృష్ణ, రెడ్డి ఎం శ్రీనివాస్ విశ్వనాథ్‌లు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రారంభించిన జేఏసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల జీతాలు ఇప్పటికైనా పెంచకుంటే కాంట్రాక్టు కార్మికుల సత్తా ఏమిటో భవిష్యత్తు కార్యరూపం దాల్చకముందే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .
దీక్ష అనంతరం నిర్వహించిన భారీ ధర్నాలో జేఏసీ నాయకులు భూక్య రమేష్ సతీష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు బి మధు, ఎస్ కే యాకుబ్ షావలి, యాకయ్య, మేడిపల్లి కరుణాకర్, రాంసింగ్ పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ, కార్యదర్శి జాటోత్ కృష్ణ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబీ శౌరి, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, ఏ ఐ ఎఫ్ టి యు రత్నకుమార్ ,సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, డి వీరన్న, నందిపాటి రమేష్, గోపాల్ రావు ,సంపూర్ణ మద్దతు తెలిపారు .