విజయవంతంగా ఆపరేషన్ చేయూత

జిల్లాలో 122 మంది మావోల లొంగుబాటు
ఏజెన్సి ప్రజల అభివృద్ధికి పోలీసుల సహకారం
ఐజిపి చంధ్రశేఖర్ రెడ్డి
కొత్తగూడెం: తెలంగాణలో ఆపరేషన్ చేయూత సఫలీకృతంగా సాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై ఆయుధాలను వీడి పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోతున్నారని మలీట జోన్ 1 ఇన్ప్సెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంధ్రశేఖర్ రెడ్డి తెలిపారు. గడిచిన రెండున్నర నెలల్లో జిల్లా వ్యాప్తంగా 122 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు వెల్లడిరచారు. మల్టీ జోన్-1ఐజిపి శనివారం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వాటర్స్‌ను పరిశీలించారు.
ఈసందంర్భంగా ఐజి చంధ్రశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసుల ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఐజి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు 81బెడాలియన్, 141బిఎన్ సిఆర్‌పిఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు సత్వఫిలాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు తెలుసుకుని, నక్సలిజాన్ని విడిచిపెట్టి జనజీవనంలో కలిసేందుకు భారీ సంఖ్యలో మావోలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని స్పష్టం చేశారు. మావోలు మనస్సు మార్చుకుని కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణం తీసకుని జిల్లాలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 64 మంది మావోయిస్టులు లోంగిపోయారని వెల్లడిరచారు. లోంగిపోయిన వారిలో ఎసిఎం, పార్టీ సభ్యులు 10,ఆర్‌పిసి కమిటీ సభ్యులు 9,ఆర్‌పిసి మిలిషియా19,ఆర్‌పిసి డిఎకెఎంఎస్, కెఎంఎస్,11, ఆర్‌పిసి సిఎన్‌ఎం 6,ఆర్‌పిసి జిఆర్‌డి 8 మంది ఉన్నట్లు వెల్లడిరచారు.
లొంగిపోయిన మావోలకు అనంతరం చెందాల్సిన ప్రతిఫలాలను తక్షణమే అందేలా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సౌకర్యాలను పొందుతూ తమ కుటుంబ సభ్యులతో కలిసి లొంగిపోయి ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని స్పష్టం చేశారు. జనవరి నుండి నేటి వరకు వివిధ క్యాడర్లలో పనిచేసిన 122 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని పేర్కొన్నారు. అందులో డివిసిఎం, ఎసిఎంఎస్ 4, పార్టీ సభ్యులు 14, సిసిసిఎంఎస్ 2, విలిషియా సభ్యులు 44 మంది, మిగిలిన వారు వివిధ క్యాడర్‌లో పని చేసినవారే లొంగిపోయారని చెప్పారు.
గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూన్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలు జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందుపాతరలను అమర్చుతూ ఏజెన్సీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఒక ఆదివాసీ మహిళ మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి తన కాలును కోల్పోవడం కూడా జరిగిందని, మావోయిస్టు పార్టీ నాయకుల దుశ్చర్యలతో ఆదివాసీ ప్రజలు కనీస సౌకర్యాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
లొంగిపోయి సాదారణ జీవనం గడపాలనుకునే మావోలు కుటుంబ సభ్యుల ద్వారా, స్వయంగాను, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో, జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరుపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అంధించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పి రోహిత్ రాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.