కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా
- రూ 26వేలు చెల్లించాలి
- జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ డిమాండ్
కొత్తగూడెం : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, అద్దె బస్సు కార్మికులు, పెట్రోల్ బంకు కార్మికులు ,
షాపింగ్ మాల్స్ ,ప్యాకింగ్ వర్కర్స్, నర్సరీ కార్మికులు, ప్రైవేటు నర్సింగ్ హోమ్ , బిల్డింగ్ వర్కర్స్, గుమాస్తాలు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వివిధ పని ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతన జీవోను అమలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్న షెడ్యూల్ పరిశ్రమ కార్మికుల నూతన వేతన సవరణను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే వేతన జీవన వెనక్కు పంపి కనీస వేతనం రూ 26 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .
బిజెపి కేంద్రంలో అధికారంలో వచ్చాక కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ,కార్మికుల శ్రమను అగౌరవపరుస్తుందని ఆయన విమర్శించారు. నెలకు రూ 4628 నిర్ణయం చేసి కార్మికులకు ఇవ్వాలని కొత్త వేతన చట్టాన్ని సవరణ చేసి ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తూ సవరణలు చేస్తుందని అన్నారు. కార్మికుల శ్రమను దోపిడీకి గురి చేసేలా ఈ వేతన పద్ధతిని సవరించి, కనీస వేతనం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు అసంఘటిత రంగ కార్మికులకు అండగా నిలిచి పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు .
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచుతామని కాంట్రాక్టు వర్కర్లకు పర్మినెంట్ చేస్తామని ఈఎస్‌ఐపిఎఫ్ అమలు చేస్తామని సంక్షేమ పథకాలన్నీ అసంఘటిత కార్మికులకు వర్తింప చేస్తామని ఎన్నికల హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఏ ఒక్కటి అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అసంఘటిత రంగ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. కనీస వేతనాలు అమలు చేయకపోతే కార్మికుల అంతా ఐక్యంగా పోరాటం చేసి సాధించుకుంటారన్నారు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కే సత్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ సిఐటియు నాయకులు కత్తి నరసింహ ప్రదీప్ పద్మ తదితరులు పాల్గొన్నారు.