టీ ప్రైడ్ పథకంతో 45శాతం సబ్సిడీ
- అర్హత పరిశ్రమలకు అనుమతులివ్వండి
- ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్

కొత్తగూడెం : పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని, దీంతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, అర్హత ఉన్న పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి టీఎస ఐపాస్, టీప్రైడ్ కింద అర్హత ఉన్న పరిశ్రమలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన టీఎస్ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ దళిత్ ఎంటర్ ప్రెన్యూసర్స్ (టీ ప్రైడ్) పథకం కింద మహిళలు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి లేదా స్వయం ఉపాధి కోసం వాహనాలు కొనుగోలు చేయడానికి 45శాతం సబ్సిడీ అందుతుంది అన్నారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీఎస్ ఐపాస్, టీప్రైడ్ కింద పీఎం ఈజిపి, పీఎం ఎఫ్‌ఎంఈ, ముద్ర రుణాలు వంటి పథకాలు, డీఆర్డీఏ ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పరిశ్రమలు స్థాపించాలన్నారు. టీ ప్రైడ్ పథకం ద్వారా 35నుండి 45శాతం సబ్సిడీ పొందవచ్చు అన్నారు. అలాగే టీఎస్ ఐ-పాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన వివిధ అనుమతులు మంజూరు, పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో మినీ రైస్ మిల్ లు, చేపల పెంపక యూనిట్లు, ఆయిల్ ఫార్మ్స్, మేజ్ పరిశ్రమలు, కులవృత్తులకు చేయూత, రవాణా వాహనాలు తదితర పరిశ్రమంలో జిల్లా లో ఏర్పాటు చెయ్యాలని తద్వారా గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు.
అదేవిధంగా అశ్వాపురం భారజాల కర్మాగారం అణు జల ఉత్పత్తి అనంతరం మిగిలిన నీటిని వృధాగా వదిలేస్తున్నారని, ఆ నీటిలో ఎంతో పోషక విలువలతో కూడుకుని ఉంటాయి కాబట్టి ఆ నీటి ఉపయోగంతో మినరల్ వాటర్ ప్లాంటును స్థాపించడం ద్వారా స్థానిక గిరిజనులు అభివృద్ధి చెందవచ్చు అన్నారు. అదేవిధంగా కర్మగారంలో ఫ్లై యాష్ ను ఉపయోగంతో ఇటుకల తయారీ పరిశ్రమలను నెలకొల్పటానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గిరిజనులకు అందించే రుణాల పైన అవగాహన కల్పించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి తిరుపతయ్య, ఐపిఓ పృథ్వి, జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్, జిల్లా మైనింగ్ అధికారి దినేష్, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి రమేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.