మలిదశ ఉద్యమంలో భాస్కర్ పాత్ర మరువలేనిది
- భాస్కర్ మరణం బిఆర్‌ఎస్‌కు తీరని లోటు
- రూ 5లక్షల ఆర్ధిక సహాయం : ఎంపీ రవిచంద్ర
కొత్తగూడెం : తెలంగాణ మలిదశ ఉద్యమంలో మోరె భాస్కర్ కీలక పాత్ర పోషించారని,ఆయన అకాల మరణం బిఆర్‌ఎస్ కుటుంబానికి తీరని లోటు అని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం ఊపిరులూదిందని, మలిదశ ఉద్యమం సైతం ఉవ్వెత్తున సాగిందని, ఉద్యమ నేత మాజీ సిఎం కెసిఆర్‌కు అండగా నిలిచిన గడ్డ ఇది అన్నారు. భాస్కర్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దివంగత నేత భాస్కర్ సంతాపసభ రామవరం నాగయ్యగడ్డలోని సాధన గ్రౌండ్‌లో శనివారం జరిగింది. ఈ సభకు ఎంపీ రవిచంద్ర బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జెఎసి ఛైర్మన్ ఉప్పల వెంకట రమణలతో కలిసి సంతాపసభకు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎంపి రవిచంద్ర మాట్లాడుతూ భాస్కర్ దశదిన కర్మల సందర్భంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. దివంగత నేత భాస్కర్ సతీమణి పార్వతి, కుమారులు పవన్ కళ్యాణ్, చాణక్యలను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. తర్వాత జరిగిన సంతాపసభలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ ఎన్నికల ఇంఛార్జిగా తాను కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన సమయంలో భాస్కర్ పరిచయం అయ్యారని తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని గుర్తు చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తి, దీక్షా దివస్ సందర్భంగా ఆయన్ను సన్మానించానని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలలో ఉన్న తనకు భాస్కర్ మృతి చెందినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఆయన అకాల మృతి పార్టీకి తీరని లోటని, ఆయన గత స్మృతులను ఎంపి నెమరువేసుకున్నారు.

భాస్కర్ కుటుంబానికి బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భాస్కర్ కుమారులు పవన్ కళ్యాణ్, చాణక్యల చదువులు, ఉద్యోగాల కల్పనకు, భవిష్యత్తుకు కెటిఆర్‌తో పాటు తాము సాయపడతామని భరోసానిచ్చారు. ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని, పార్టీ వారికి కొండంత అండగా నిలుస్తుందని,కాపాడుకుంటుందని చెప్పారు. సభలో కాంతారావు మాట్లాడుతూ భాస్కర్‌తో తనకు 35ఏండ్ల సాన్నిహిత్యం ఉందని, తన గెలుపు కోసం కృషి చేసిన మంచి నాయకుడన్నారు. వనమా మాట్లాడుతూ, భాస్కర్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారని, పార్టీలో ఆయన స్థానం పూడ్చలేనిదని చెప్పారు. ముందుగా ఎంపీ రవిచంద్ర, కాంతారావు, వెంకటేశ్వరరావు, వెంకటరమణలు భాస్కర్ చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు భాస్కర్ సతీమణి పార్వతి, కుమారులు పవన్ కళ్యాణ్, చాణక్యలను పరామర్శించి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పంపించిన రూ 5 లక్షల చెక్కును అందజేశారు. సభకు బిఆర్‌ఎస్ నాయకుడు రాజుగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో వెంకటరమణ మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో భాస్కర్‌తో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ భాస్కర్ చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు పగడాల నరేందర్, తొగరు రాజశేఖర్, హుస్సేన్, నవనతన్, అనుదీప్ తదితర ప్రముఖులు పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.