మహిళల శ్రమ దోపిడి పై పోరాడాలి
- త్రిశూల్ విధానాలను అనుసరిస్తున్న బిజెపి
- ఐద్వా బహిరంగసభలో బృందా కారత్

కొత్తగూడెం : మహిళల శ్రమను దోపిడి చేస్తున్న మనువాదం, పెట్టుబడిదారీ విధానాలపై పోరాటాలు కొనసాగించాలని ఐద్వా జాతీయ సీనియర్ నాయకురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వారాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బృందాకారత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం త్రిశూల్ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు.అందో ఒకటి పెట్టుబడి దారి కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు, రెండోది మతోన్మాద భావజాలం ఇది లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమైన దని, మూడవ విధానం మహిళలను తిరోగమన భావజాలం వైపు నడిపించే మనువాద సిద్ధాంతం అన్నారు. త్రిశూల విధానాలను అనుసరించడం ద్వారా బిజెపి ప్రభుత్వం మహిళా హక్కులపై ముప్పేట దాడి చేస్తుందని ఆరోపించారు. దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ అధిపతులకు 40 శాతం సంపదను శాసిస్తున్నారని, సమాజంలో అసమానతలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులు, సంపన్నులకు రూ 40 లక్షల కోట్ల రాయితీలు కల్పించిందని, దేశంలోని వితంతువులు, ఒంటరి మహిళలు అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బడ్జెట్‌లో మొండి చేయి చూపించిందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు బిజెపి ప్రభుత్వం ఊడిగం చేస్తుందని దుయ్యబట్టారు. దేశంలో మహిళల శ్రమ ద్వారా అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు . ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో49 శాతం వాటాలను ప్రైవేట్ పరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీని ఫలితంగా వేలాదిమంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఓపెన్ ఉపరితల గనుల కోసం గిరిజనులు, దళితుల నుంచి పెద్ద ఎత్తున భూ సేకరణ జరుగుతుందని సరైన నష్టపరిహారం అందించడం లేదని పేర్కొన్నారు.

మణుగూరు ప్రాంతంలో గిరిజనుల నుంచి మూడుసార్లు సింగరేణి భూములు గుంజుకుని వారిని నిర్వాసితులు చేసిందని చెప్పారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు ఈ దేశ పౌరులు కాదా?అని కేంద్ర ప్రభుత్వాన్ని బృందాకారత్ ప్రశ్నించారు. దేశ సంపదను, భూములను ఆదివాసీల నుంచి దళితుల నుంచి గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకమైందని ,మహిళా హక్కులకు వ్యతిరేకమైందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వారిలో 95 శాతం మంది మహిళలు ఉన్నారని వారు రోజుకి 3వేల కిలోల మట్టిని మోసినందుకు రూ 250 ఇస్తున్నారని మండి పడ్డారు. ఈ దోపిడీ ఆమోదించదగింది కాదన్నారు. మోడీ చెబుతున్న డిజిటల్ ఇండియాలో ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు వచ్చే అవకాశం లేదని, మరి ఇదెక్కడి డిజిటల్ ఇండియా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పోరాటాలు నిర్వహిస్తున్నారని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని కాంగ్రెస్ హామీ ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని ఇల్లు లేని మహిళలందరికీ స్థలాలు పక్కా గృహాలు అందించాలని డిమాండ్ చేశారు.
దేశంలో బిజెపి పాలనలో 65 వేల మంది మహిళలు వరకట్న హత్యలకు గురయ్యారని వీరిలో అత్యధిక మంది హిందూ మహిళలని వీరిని హత్య చేసింది కూడా హిందువులేనని స్పష్టం చేశారు. హిందూ మతం కోసమే ఉన్నామని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులకు వరకట్న సమస్యపై పోరాడే దమ్ము ఎందుకు లేదని చెప్పారు. మహిళలపై జరుగుతున్న వరకట్నం హత్యలు, అత్యాచారాలు, వేధింపులపై మోడీ, అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశంలో ప్రతి గంటకు 50 మంది మహిళలపైఏదో ఒక రూపంలో హింస జరుగుతుందని వెల్లడిరచారు. ప్రతిరోజు 88 మంది మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వీటన్నిటిని మత భావజాలం దృష్టితోనే బిజెపి చూస్తుందని పేర్కొన్నారు.
బిజెపి పాలనలో మహిళలపై నేరాలకు 28శాతం పెరిగాయని తెలిపారు. వీటన్నిటిని పరిశీలిస్తే బిజెపి పాలనలో మైలిక రక్షణ ఉండదనేది అర్థమవుతుంది అన్నారు. మహిళలపై జరుగుతున్న వరకట్న హత్యలను హింసను సమర్థించటమేనా బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ చెప్తున్న దేశభక్తి, జాతీయవాదమని నిలదీశారు. దేశంలో ధరల పెరుగుదల తీవ్రస్థాయిలో ఉందని ఆహార భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. .కేంద్రం ధరల నియంత్రన వదిలేసి కార్పొరేట్ మార్కెట్ శక్తులపై ఆధారపడిరదని దీనివల్ల ప్రజలపై ఆర్థికంగా దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ ,సమానత్వంకోసం ఐద్వా పోరాటాలు నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను త్రిశూల సిద్ధాంతాన్ని దేశం నుండి తరిమేయటానికి పోరాటమే మార్గమని ఆమె అన్నారు. మోటూరి ఉదయం ,లీల సుందరయ్య, మల్లు స్వరాజ్యం చిట్యాల ఐలమ్మ ,మానికొండ సూర్యవతి వంటి త్యాగదనుల పోరాట వారసత్వాన్ని ఐద్వా పునికి పుచ్చుకొని మనువాద భావజాలం పైన, పెట్టుబడిదారీ విధాన దోపిడీ పైన తిరుగుబాటు చేయాలని కోరారు.
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ముందుగా ధరలు నియంత్రించాలని, మద్యపానం నియంత్రించాలి, ప్రభుత్వ విద్యా వైద్యం పటిష్టంగా అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ,జాతీయ అధ్యక్షురాలు పీకే, జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి, జాతీయ ఉపాధ్యక్షురాలు సుదా సుందర రామన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షరాలు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షులు టి జ్యోతి ,బుగ్గ పెట్టి సరళ, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి సీతాలక్ష్మి, ఎం జ్యోతి ,తదితరులు ర్యాలీ అగ్రభాగంలో నడిచి ప్రదర్శన నిర్వహించారు.