అక్రమ నియామకాలను రద్దు చేయాలి

కొత్తగూడెం : నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ పద్ధతిలో జిల్లా మెడికల్ కళాశాలలో బర్తీ చేసిన పోస్టులను రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా మెడికల్ కాలేజీలో చేపట్టిన నియామకాలను రద్దు చేయాలంటూ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా శివ శంకర్ మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా మెడికల్ కళాశాలలో మొదటి విడత 32 పోస్టులను, రెండో విడతలో 73 పోస్టులలో 49 పోస్టులను బర్తీ చేశారని అరోపించారు.
జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ అనుమతి లేకుండా, అసలు జిల్లా సెలక్షన్ కమిటీయే లేకుండా ఎలా నియమకాలు చేప్పారని ప్రశ్నించారు. నిరుద్యోగుల దగ్గర నుంచి రూ లక్షల్లో వసూలు చేసి మెరిట్ బేస్ కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే రూల్స్‌కి వ్యతిరేకంగా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించి అక్రమ పద్ధతుల్లో ఔట్సోర్సింగ్ యాజమాన్యం చేపట్టిన నియమకాలను తక్షణమే రద్దు చేసి, తక్షణమే మెగా జాబ్ మేళా ద్వారా బర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, మారయ్య తదితరులు పాల్గొన్నారు.