మత్స్య పరిశ్రమకు మహర్దశ
- కుల వృత్తులకు ప్రోత్సాహం
- చేప పిల్లలు, రొయ్యలను విడుదల చేస్తాం
- మంత్రి పొంగులేటి
ఖమ్మం : ఇందిరమ్మ రాజ్యంలో కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా చేప పిల్లలను చెరువులలో, కుంటలలో విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మత్స్యకారులకు ఉపాది మార్గాలు మరింత మెరుగు పడతాయన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపీ రామసహారం రఘురాం రెడ్డితో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక చెరువులు, కుంటల, నీటి వనరులలో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తున్నామని అన్నారు. జలాశయం సామర్థ్యం మేర మరో 5 లక్షల చేప పిల్లలు, రొయ్య పిల్లలు విడుదల చేయాలని స్థానిక మత్స్యకారులు కోరారని, వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తూ పూర్తి సామర్థ్యం మేర జలాశయంలో చేప పిల్లలు విడుదల చేస్తామన్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదల్లో మత్స్యకారులు వినియోగించే వలలు, తెప్పలు కొట్టుకొని పోయాయని, వరదల వల్ల నష్టం జరిగిన మత్స్యకారులకు త్వరలోనే ప్రభుత్వం ఆదుకుంటుందని, మత్స్యకారులను ఆదుకోవడంలో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తామని స్పష్టం చేశారు.
పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు కట్టిన రివాల్వింగ్ ఫండ్ విడుదల అయ్యేలా చూస్తామన్నారు. రేకుల షెడ్డులో చేప పిల్లలు అమ్ముతున్నారని, హైవే పక్కన షాప్ పెట్టుకుంటామని కోరారని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని మంత్రి తెలిపారు.
వరదలకు దెబ్బతిన్న ఇండ్లకు కొంత పరిహారం అందించామని, నదీ ప్రవాహం సమీపంలో ఉన్న ప్రజలు మరోచోట ఇల్లు కట్టుకుంటామని కోరారని, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు.
అనంతరం ఎంపి రఘురాం రెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ 1700 హెక్టార్ల విస్తీర్ణంలో ఉందని, దీనిలో 7 లక్షల చేప పిల్లల విడుదల చేశామని అన్నారు. జలాశయంలో మరో 6 లక్షల చేప పిల్లలు విడుదల చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించామన్నారు. చేప పిల్లలతో పాటు రొయ్యలు విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పిశ్రీజ, ఆర్డీఓ గణేష్, మత్స్య శాఖ ఉప సంచాలకులు ఆర్ లక్ష్మీ నారాయణ, ఇన్చార్జి జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్య సంఘం ప్రతినిధులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.