త్వరలో స్మార్ట్ రేషన్,హెల్త్ కార్డు
- విద్యా, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంటికే
- పనితీరు మారకుంటే లిస్టు రెడీ చేయండి
- నిరంతర పర్యవేక్షణలో కలెక్టర్లు ఉండాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లందు : ప్రభుత్వ విద్య, వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఈ రెండు శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది అధికారులను ఇంటికి పంపించక తప్పదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఇల్లందు పర్యటనలో భాగంగా ఎస్‌ఎస్ గార్డెన్‌లో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యా ,వైద్య ,త్రాగునీరు రోడ్లు, విద్యుత్ ,వ్యవసాయ, ఈజీఎస్, ఐకెపి ఇలా అన్ని శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారుల, సిబ్బంది పనితీరు, సమస్యల పరిష్కారం పై సమీక్షించారు.
వైద్య శాఖలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది స్థానికంగానే ఉండాలని ఆదేశించారు. నేటికీ కొంతమంది ఉపాధ్యాయులు సకాలంలో స్కూల్స్‌కు రావడం లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇల్లందు వైద్యశాలకు మరో ఐదు డయాలసిస్ బెడ్లు, గార్ల వైద్యశాలకు సైతం డయాలసిస్ బెడ్లను అందజేస్తాము అన్నారు. నేటికీ కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందకున్నా, అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తున్నట్లు చూపించడం సరికాదని హెచ్చరించారు. వర్షాకాలంలో వరదలకు ధ్వంసమైన రోడ్లను తక్షణమే పునర్నిర్మించాలని తెలిపారు. కల్వర్టులు ఉన్న ప్రాంతాల్లో దృఢమైన నిర్మాణాలు చేపట్టాలని ఆర్‌అండ్‌బి శాఖకు సూచించారు.
గాలి దుమారాలు, వర్షాల వలన ధ్వంసమైన విద్యుత్ స్తంభాలను పునర్నిర్మించాలని విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో రూ 200, ఉచిత విద్యుత్, గృహజ్యోతి సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ, ఎంపిడివోలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ ఫిర్యాదులు పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు కనిసిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేటికీ కొందరు అధికారులు గత పాలకుల పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నారని, బిఆర్‌ఎస్ కాలమే ఉందన్న భ్రమ నుండి తేరుకోవాలని, లేని పక్షంలో ఇంటికి వెళ్ళక తప్పదని హితవు పలికారు.
అక్టోబర్ 2 నుండి స్మార్ట్ రేషన్ ,హెల్త్ కార్డు

అక్టోబర్ 2 నుండి అర్హుల నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తాము అన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వారం రోజుల్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు జారీ చేసేందకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో సైతం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను అర్హులకు అందిస్తామని స్పష్టం చేశారు. పెండిరగ్ బిల్లులు చెల్లించి పూర్తికాని వాటిని పునర్నిర్మాణ పనులు చేపటి,్ట కొత్త ఇండ్లకు దరఖాస్తులు, నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, ఐటీడీఏ పీవో, ఎస్పీ రోహిత్ రాజ్ మహబూబాబాద్ కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ ఖమ్మం జిల్లాల డిఎంహెచ్‌ఓ లు, అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా ఇల్లందుకు వచ్చిన సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ గజమాలతో ఘనస్వాగంతం పలికారు.