సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచండి
- శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
- కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవసరం
- గంజాయి కట్టడిలో అధికారుల తీరు ప్రశంసనీయం
- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం : సైబర్ నేరాల పట్ల ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాన పెంచాలని, ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పి రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రలకు విఘాతం కల్గిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలను సైబర్ నేరాల భారిన పడకుండా విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టాలని అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారని, సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు అనునిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేయాలి అన్నారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలి అన్నారు. పెండిరగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, జూదం, బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ నివారణాచర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మావోల కదిలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. జిల్లాలో వరదల సమయంలో, గణేష్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అహర్నిశలు ప్రజలకు సేవలాందించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనేలా విశ్వాసాన్ని కలిగించారని ప్రశంసించారు.
అనంతరం గత నెలలో వర్టికల్స్ వారీగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.