సింగరేణి చరిత్రలో అత్యధిక బోనస్
- కార్మికులకు 33 శాతం లాభాల బోనస్
- కార్మికుడి ఖాతాలోకి రూ 1.9లక్షలు
- తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ 5వేల
- భవిష్యత్ వ్యాపార విస్తరణకు రూ 2,289 కోట్లు
- సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన రూ 4701 కోట్లల లాభాలలో రూ 2412 కోట్లలో 33 శాతాన్ని లాభాల వాటా బోనస్‌గా కార్మికులకు చెల్లించనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం మిగిలిన రూ 2,289 కోట్ల కేటాయించినట్లు వెల్లడిరచారు. శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యులతో కలిసి సచివాలయంలో లాభాల బోనస్ను ప్రకటించారు. 33 శాతం వాటా కింద రూ 796 కోట్లను కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తుందన్నారు. ఒక్కొక్క కార్మికుడు సగటున రూ 1.9లక్షల వరకు చెల్లింస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక లాభాల వాటా బోనస్‌గా నిలువ నుంది అన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల బోనస్‌ను వర్తింపజేసిన ఘనత తమ ప్రభుత్వానిది అన్నారు.
- గతంలో కంటే రూ 85 కోట్లు అధికం
2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా కింద ప్రకటించిన 32 శాతంతో రూ 711 కోట్లను కార్మికులకు పంపిణీ చేయగా ప్రస్తుతం 33శాతంతో రూ 796 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇది గతంలో కన్నా రూ 85 కోట్లు అధికం అన్నారు. కార్మికులు సగటున రూ 1.7లక్షల లాభాల బోనస్ అందుకోగా ఇప్పుడు సగటున రూ 1.9లక్షలు అందుకోబోతున్నారని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపడంతో ఎప్పుడూ లేనంతగా రూ 4701 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించిందన్నారు.
- తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్
సింగరేణి కాలరీస్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులకు లాభాల బోనస్ను చెల్లించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కంపెనీలో 25 వేల మంది వరకు కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడిరచారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారికి నిబంధనల ప్రకారం బోనస్ను సంస్థ చెల్లిస్తుంది అన్నారు. సగటున కార్మికుడికి రూ 5 వేల వరకు లాభాల బోనస్ పొందే అవకాశం ఉందన్నారు.
- బహుముఖ వ్యాపార విస్తరణ
ఈ ఏడాది వచ్చిన 4701 కోట్ల రూపాయల లాభాలలో 2289 కోట్ల రూపాయాలను కంపెనీ విస్తరణ , అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క తెలిపారు. కంపెనీ ఆర్థిక సుస్థిరత, భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంలో బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. సోలార్ విద్యుత్ను 1,000 మెగావాట్లకు పెంచాలని, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డుడ్ స్టోరేజీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుత 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రామగుండంలో తెలంగాణ జెన్కో భాగస్వామ్యంలో 800 మెగావాట్ల ప్లాంట్ను ,ఒడిశాలో 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
సింగరేణి సంస్థలో వీకే ఓసీ, గోలేటి ఓసీ, నైనీ ఓసీలను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు, తద్వారా ఏడాది ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులకు చేరుకోనుందన్నారు. నూతన సీహెచ్పీల నిర్మాణం, కార్మికుల సౌకర్యార్థం క్వార్టర్లు, కార్మికుల పిల్లల కోసం సింగరేణి పాఠశాల ఆధునికీకరణ, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ, క్యాథ్ ల్యాబ్ల ఏర్పాటు, క్యాంటీన్ల ఆధునికీకరణ, హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, కాబట్టి కార్మికులు, అధికారులు సమర్థంగా పనిచేస్తూ రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తికి కృషి చేసి సంస్థను ఆదర్శవంతమైన కంపెనీగా తీర్చిదిద్దాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.