పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం : పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులు, మొదలగు పనుల వాటిపై అధికారులతో మాట్లాడి, ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టులవారీగా కార్మికులు పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని, కాల్వ తవ్వకం, లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు.మంత్రి పర్యటన సందర్భంగా ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, ఎస్‌ఇ నర్సింగ రావు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.