ముంపు బాదితులను ఆదుకుంటాం
వరద తగ్గేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం : ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాలు, మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్‌లో వరద ముంపు గురైన కాలనీలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. వరద ముంపు ప్రాంత వాసులతో మాట్లాడారు.రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న రాజీవ్ నగర్ కాలనీ రిజర్వాయర్లో తెప్పపై ప్రయాణించి కాలనీలోని సహాయక చర్యలను కలెక్టర్ పరిశీలించారు. వరద తగ్గేవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వసతి గృహాంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సౌకర్యాలు మంచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని, నిర్లక్ష్యంగా ఉండవద్దని అన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ వేణు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు తదితరులు ఉన్నారు.