రూ 137.21 కోట్ల రైతుల రుణమాఫీ
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- రోడో విడతలో 16377 మందికి లబ్ది
- ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీలో భాగంగా రెండో విడత రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఐడి ఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. మొదటగా హైదరాబాద్ నుంచి సిఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం రెండో విడత నిధుల విడుదలలో రూ లక్ష 50 వేలలోపు రైతు రుణ మాఫీకి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడిరచారు. జిల్లాలో రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా 16377 మంది లబ్ధిదారులకు గాను రూ 137,21,96,477 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
రైతులు తమ ఇల్లు మరియు పొలాలలో నీటి కుంటలు ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా అజోల్ల నాచు పెంపకం చేపట్టాలన్నారు. నీటి కుంటలో కొర్రమీను చేపల పెంపకం ప్రయోగత్మకంగా చేపట్టాలన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. రైతులు పశు సంపద సంరక్షణలోకు పశువుల కొట్టాలు ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన పశువుల కొట్టాలకు తిరిగి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలోని ములకలపల్లి మండలం పాతూరు గ్రామంలో రైతులు చేపలు పెంపకం చేపడుతున్నారని, దుమ్ముగూడెం రైతులు బాతులు పెంపకం ద్వారా మంచి లాభాలను గడిస్తున్నారని పేర్కొన్నార. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు బాతుల పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీలో ఎటువంటి సమస్య వచ్చినా బ్యాంకర్లు ఎఈవోకు తెలిపితే తక్షణమే సమస్యను జిల్లా కార్యాలయానికి తెలియజేసి పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలను వినియోగించుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, రైతులకు ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వ యంత్రాంగం అధికారులు సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. అనంతరం రైతులకు కలెక్టర్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీ ఎస్‌ఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార అధికారి ఖుర్షిద్,కెవికె శాస్త్రవేత్త లక్ష్మీనారాయణమ్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ రెడ్డి, అన్ని బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.