దరఖాస్తుకు ఎలాంటి పత్రాలు అక్కరలేదు
ఆధార్‌లో రాష్ట్రం పేరు మార్పు తప్పనిసరి కాదు
జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల

భద్రాద్రి : ఆదాయం, కుల దృవీకరణ సిర్టిఫికేట్లు లేకున్నా ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవచ్చని, ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నా సవరణలు అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఒక పాస్ ఫోటో పెడితే సరిపోతుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఆంద్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయ, కుల ధ్రువీకరణలు అడుగుతున్నారని వచ్చే పుకార్లను జిల్లా ప్రజలు నమ్మొద్దని కోరారు. ఏదేని సలహాలు, సూచనలు. కొరకు ప్రజలు హెల్ప్ డెస్క్ లేదా రెవెన్యూ, ఎంపిడిఓ, ఎంపిఓ, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంగ సభ్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూము 08744-241950కు కార్యాలయ పని వేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. ప్రజాపాలన రెండవ రోజు 74 గ్రామ పంచాయతీల్లోను, మూడు మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి 34995 గృహాల లబ్ధిదారుల నుండి 44711 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడిరచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన 481 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రసీదు అందజేయడంతో పాటు ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు రెండు షిప్టులలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటికి ప్రజాపాలన దరఖాస్తులు ఉచితంగా అందచేస్తున్నామని చెప్పారు. ప్రజలు దళారుల మోసపూరిత మాటలను నమ్మొద్దని సూచించారు. దరఖాస్తులు నింపుటకు ప్రజల సహాయార్థం ప్రతి కౌంటర్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు.