15 న స్పెషల్ లోక్ అదాలత్
- పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం : జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాజీ పడదగిన కేసులలో ఇరు వర్గాల వారి నిర్ణయాలతో కొన్ని కేసులను ఈ నెల 15 న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ నందు పరిష్కరమయ్యేలా కృషి చేయాలన్నారు. చిన్న విషయాలకు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం కన్నా రాజీ పడటమే ఉత్తమమని కక్షిదారులకు వివరిస్తూ కేసులను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని తెలిపారు. క్రిమినల్ కేసుల్లోని నిందితులకు కేసుల తీవ్రతను బట్టి త్వరితగతిన శిక్షలు పడేలా చేసి కన్వీక్షన్ రేటును పెంచాలని కోరారు.
ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఉన్నతాధికారుల సలహాలతో ముందుకెళ్లాలని సూచించారు. భాదితులకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేయాలి అన్నారు. కేసుల పరిష్కారం విషయాలలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్ జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.