గణేష్‌ ఉత్సవ కమిటీలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి

  • మండపాలకు అనుమతులు తప్పనిసరి
  • నియమ నిబంధనలను పాటించాలి
  • ఎస్పి రోహిత్‌ రాజు

కొత్తగూడెం : జిల్లాలో గణేష్‌ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ రూపొందించిన పోర్టల్‌ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు ఆదేశించారు. గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించే కమిటీలు అనుమతుల కోసం ఆన్‌ లైన్‌ పోర్టల్‌లో ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్‌ ఇన్ఫర్మేషన్‌ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని అన్నారు.ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఆన్లైన్‌ ద్వారానే అనుమతి మంజూరు చేస్తామని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గణేష్‌ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలు వివరించారు. గణేష్‌ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే అని, ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని, ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలి అన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని, సంబంధిత శాఖలతో అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్‌ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి, మండపాలలో, శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదని ఆదేశించారు. మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్‌ ఉండాలని, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దగ్గరలో ఇసుక, నీటిని అందుబాటులో ఉంచాలని, గణేష్‌ మండపాల వద్ద మద్యంసేవించడం, పేకాట ఆడటం,అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు, పాటలు పూర్తిగా నిషేధం ఆన్నారు. మండపం వద్ద పాయింట్‌ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారని, అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్‌ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్‌ 100కుగాని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని,ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులనుగాని, 100 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading