డిజిటల్ కార్డు సర్వే షురూ
- కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కొత్తగూడెం : ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లో కుటుంబ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. డిజిటల్ కార్డు సర్వేలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫామిలీ డిజిటల్ కార్డు జారీలో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఏడు గ్రామాలు, మూడు మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో 330, మణుగూరు మున్సిపాలిటీలోని 6 వార్డులో 248, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో 310 కుటుంబాలను, లక్ష్మీదేవిపల్లి మండలం లాల్ తండా పంచాయతీలో 171, దమ్మపేట మండలం ఆళ్లపల్లి పంచాయతీలో 175, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో 178, అశ్వాపురం మండలం అశ్వాపురం మండలం చందర్లపాడు పంచాయతీలో 190 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. చర్ల మండలం పులిగుండాల గ్రామంలో 190, భద్రాచలం గ్రామ పంచాయతీలోని 9వ వార్డులో 280, దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామంలోని 175, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలోని 178, ఇల్లందు మండలం పూబెల్లి పంచాయతీలోని 172 ఫ్యామిలీస్‌కు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు.
ఈ సర్వేలో కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, యజమానితో గల సంబంధం తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు తెలిపారు. చనిపోయిన, వివాహం చేసుకొని వెళ్లిన వారి వివరాలను తొలగించాలని కొత్తగా వివాహమై కుటుంబంలోకి వచ్చిన వారి, పిల్లల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో గ్రూప్ ఫోటో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు.ఈ సర్వేలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వేలో ఎటువంటి సందేహాలు వున్నా వెంటనే తమ దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు.