బస్టాండ్ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- హోటల్ బాధ్యతలు శ్రీ శక్తి సంఘానికి అప్పగిస్తాం
- ఖాళీ స్థలాన్ని పార్కుగా మార్చాలి
- ఆర్టీసీ డిఎంకు కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశం
కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఆధునికరణకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ డిఎంని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన అనంతరం బస్టాండ్ అభివృద్ధి గురించి డిఎంతో కలెక్టర్ చర్చించడం జరిగింది. ఖమ్మం బస్టాండ్ తరహాలో కొత్తగూడెం బస్టాండ్ ను తీర్చిదిద్దేందుకు కావాల్సిన సదుపాయాలపై నివేదిక తయారుచేసి తనకు పంపించాలని సూచించారు. బస్టాండ్ ఆవరణలోని ఖాళీ స్థలాల్లో వివిధ రకాల మొక్కలు నాటాలని తెలిపారు. ముందు భాగంలో ఖాళీ స్థలం పెద్దగా ఉందని ఆ స్థలంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి పార్కుగా మార్చేందుకు చూడాలని ఆర్టీసీ డిఎంకు చెప్పారు.
సుందరంగా పార్క్ తయారైతే ప్రయాణికులు అందులో విశ్రాంతి తీసుకుంటారని అంతేకాకుండా చూడడానికి వాతావరణం కూడా బాగుంటుందని అన్నారు. బస్టాండ్ లో ఉన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను శ్రీ శక్తి సంఘానికి అప్పగించడం జరుగుతుందని బయట వరకు క్యాంటీన్ ఇవ్వకుండా చూడాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్ లో శుభ్రతను పాటించాలని ఇందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిఎంకు కలెక్టర్ సూచించారు.
హోటల్ మధువన్ ఎదుట పార్కింగ్ వసూలు చేయండి

కొత్తగూడెం ఆర్టిసి బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న మధువన్ హోటల్ ముందు ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించి హోటల్ ముందు ఎవరైనా ప్రవేట్ వాహనాలు నిలిపితే వాటికి పార్కింగ్ చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వచ్చిన ఆదాయంతో ఆర్టీసీ అభివృద్ధికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.